Gaza: ‘అప్పుడు మీ కళ్లు ఎక్కడున్నాయి? మాపై హమాస్ దాడి కనిపించలేదా?' అని నెటిజన్లను నిలదీసిన ఇజ్రాయెల్
- అప్పుడు తమకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదని మండిపాటు
- నెట్టింట వైరల్ అవుతున్న ‘కళ్లన్నీ రఫా వైపే’ ఫొటోకు పోటీగా ‘ఎక్స్’లో ఫొటో విడుదల
- ఓ చిన్నారిపైకి హమాస్ ఉగ్రవాది తుపాకీ ఎక్కుపెట్టినట్లుగా చూపుతున్న ఫొటో
ఇజ్రాయెల్–గాజా మధ్య కొనసాగుతున్న యుద్ధం నెట్టింట కొత్త చర్చకు తెరలేపింది. గాజా ప్రాంతంలోని రఫా నగరంలో ఉన్న అతిపెద్ద పునరావాస శిబిరంపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడిలో 45 మంది పౌరులు మరణించడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
రఫాకు సంఘీభావం తెలిపేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో ఒక ఫొటోను రూపొందించారు. ఖాళీ ఎడారి మైదాన ప్రాంతంలో లక్షలాది గుడారాలు వెలిసినట్లుగా అందులో చూపారు. ఆ గుడారాల మధ్యలో ‘కళ్లన్నీ రఫా వైపే’ (ఆల్ ఐస్ ఆన్ రఫా) అనేలా ఆంగ్ల అక్షరాల ఆకారంలో కొన్ని టెంట్లను ప్రదర్శించారు.
ఈ ఫొటో కాస్తా విపరీతంగా వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, సినీ తారలు, ప్రముఖులు రఫాలోని శరణార్థులకు అండగా నిలిచారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోను పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 4.5 కోట్ల మంది యూజర్లు దీన్ని షేర్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ స్పందించింది. నెటిజన్ల చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడి మారణహోమం సృష్టించినప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎందుకు స్పందించలేదని నెటిజన్లను ప్రశ్నించింది. 1,160 మందిని కాల్చి చంపడంతోపాటు సుమారు 250 మందిని బందీలుగా పట్టుకెళ్తే తమకు సంఘీభావంగా పోస్టులు ఎందుకు పెట్టలేదని నిలదీసింది.
‘అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడున్నాయి’ (వేర్ వర్ యుర్ ఐస్ ఆన్ అక్టోబర్ 7) అంటూ ‘ఎక్స్’లో ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా ఓ ఏఐ ఇమేజ్ ను విడుదల చేసింది. అందులో ఓ చిన్నారిపైకి హమాస్ ఉగ్రవాది తుపాకీ ఎక్కుపెట్టినట్లుగా ఉంది. ఆ ఫొటో కింద ‘అక్టోబర్ 7 గురించి మాట్లాడటాన్ని ఎప్పటికీ ఆపము. బందీల కోసం పోరాటాన్ని ఎన్నటికీ ఆపము’ అని క్యాప్షన్ ను జత చేసింది.
మరోవైపు గాజా శరణార్థుల శిబిరంపై తాము వైమానిక దాడి చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. శిబిరానికి సమీపంలో ఉగ్రవాదులు నిల్వ ఉంచిన ఆయుధాలపై రాకెట్ దాడి చేస్తే దానివల్ల శిబిరంలోని గుడారాలకు మంటలు అంటుకున్నాయని తెలిపింది.
గతేడాది నవంబర్ లో కొన్ని రోజులపాటు గాజాపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించడంతో కొందరు బందీలను హమాస్ విడిచిపెట్టింది. ప్రస్తుతం హమాస్ చెరలో 99 మంది బందీలు జీవించి ఉన్నారని.. మరో 31 మంది వారి చెరలో మరణించారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
గాజాలో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 31,112 మంది మరణించారు.