Nagababu: ఓడిపోయే వాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడతారు... జనసైనికులు జాగ్రత్తగా ఉండాలి: నాగబాబు

Nagababu appeals party cadre do not respond to YCP provocations
  • ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్
  • ఓడిపోయేవాళ్లలో ఫ్రస్ట్రేషన్ ఉంటుందన్న నాగబాబు
  • హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని వెల్లడి
  • వైసీపీ కవ్వింపులకు జనసైనికులు, వీర మహిళలు ప్రతిస్పందించవద్దని స్పష్టీకరణ
ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందేశం వెలువరించారు. పోలింగ్ సందర్భంగా సమర్థవంతంగా వ్యవహరించిన రాష్ట్రంలోని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలకు... ముఖ్యంగా పిఠాపురం జనసైనికులు, వీరమహిళలకు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. 

ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఎప్పుడైనా ఓ మనిషి ఓటమి పాలవుతున్నట్టు తెలియగానే, వాళ్లలో ఒకరకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందని, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు సిద్ధమవుతుంటారని అన్నారు. 

"ఈ సందర్భంగా జనసైనికులకు, వీర మహిళలకు నా విన్నపం ఏంటంటే... మనం ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించాలి. ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, పోలీసులకు సంపూర్ణంగా సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించవద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

ఎందుకంటే... ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది... అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్ గానే ఉందాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనమేమీ చేయొద్దు. తద్వారా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకుందాం. 

రేపు రాబోతున్నది కచ్చితంగా మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి, ఓడిపోయే వాళ్లు పాల్పడే కవ్వింపు చర్యలకు, అల్లర్లకు జనసైనికులు, వీర మహిళలు ప్రతిస్పందించవద్దు" అంటూ నాగబాబు విజ్ఞప్తి చేశారు.
Nagababu
Janasena
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News