NVSS Prabhakar: వందలమంది బలిదానాలకు కారణమైన సోనియాగాంధీని దశాబ్ది వేడుకలకు పిలుస్తారా?: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాకే దశాబ్ది వేడుకలకు రావాలని డిమాండ్
- నాటి ప్రధాని, పార్లమెంట్లో మద్దతిచ్చిన పార్టీలను ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీత
- కుంభకోణాలను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తోందని విమర్శ
- బండి సంజయ్, కిషన్ రెడ్డిల ఫోన్లనూ ట్యాపింగ్ చేశారని ఆరోపణ
తెలంగాణ ఉద్యమం సమయంలో వందలమంది బలిదానాలకు కారణమైన సోనియాగాంధీని రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఆహ్వానించడంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పి దశాబ్ది వేడుకలకు రావాలన్నారు. అధికారిక వేడుకలు అన్నప్పుడు నాటి ప్రధాని, పార్లమెంట్లో మద్దతిచ్చిన పార్టీలను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలను ఆహ్వానించనప్పుడు అది పార్టీ కార్యక్రమమే అవుతుందని విమర్శించారు. దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం, ఉద్యమకారులు, తెలంగాణవాదులతో చర్చలు జరపలేదన్నారు. సోనియాను పిలవడం ఆపేసి... మిగతా పక్షాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చిహ్నం బయటకు వచ్చిన తర్వాత తమ పార్టీ నాయకత్వం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం
సీఎం కేసీఆర్ కుంభకోణాలను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో ప్రతి వారం ఒక్కో కుంభకోణం బయటకు వస్తోందన్నారు. గత ప్రభుత్వ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నప్పటికీ సీఎం మాట్లాడటం లేదని విమర్శించారు. పౌరసరఫరాల శాఖలోనూ అక్రమాలు జరిగినట్లుగా వెలుగు చూస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలోని అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాఫ్తు కోరాలన్నారు.
వారి ఫోన్లూ ట్యాప్ అయ్యాయి
ఎంతోమంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయని... వీటిపై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా తేలికగా తీసుకుంటున్నట్లు ఉందన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్‌ను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా అనేక మంది బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో డ్రగ్స్, పేపర్ లీకేజీలు, నయీమ్ వ్యవహారం వచ్చినపుడు వాటిని కేసీఆర్ రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.