Postal Ballots: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై మరోసారి స్పష్టతనిచ్చిన ఈసీ
- పోస్టల్ బ్యాలెట్లపై సీల్ లేకపోయినా సంతకం ఉంటే సరిపోతుందన్న ఈసీ
- ఆర్వో ధ్రువీకరణ తర్వాతే ఫారం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం చేస్తారని వెల్లడి
- ఆ మేరకు పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలని తాజా ఆదేశాలు
పోస్టల్ బ్యాలెట్ పై సీల్ (స్టాంపు) లేకపోయినా, సంతకం ఉంటే సరిపోతుందన్న నిబంధన వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ నిబంధనను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో, పోస్టల్ బ్యాలెట్ల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టతనిచ్చింది.
13ఏ ఫారంపై అటెస్టేషన్ అధికారి (గెజిటెడ్ అధికారి) సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ పునరుద్ఘాటించింది. 13ఏ ఫారంపై సీల్, హోదా లేకున్నా సంతకం ఉంటే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే ఫారం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం చేస్తారని, అందువల్ల సీల్ లేకపోయినా ఫర్వాలేదని వివరణ ఇచ్చింది.
తాము నిర్దేశించిన విధంగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.