Suryakumar Yadav: టీ20 క్రికెట్లో సూర్యకుమార్ అరుదైన ఘనత!
- సూర్యను వరుసగా రెండోసారి వరించిన 'టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్
- ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
- ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సూర్యకుమార్ నెం.01
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. అతడు 2024 'టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. 2023లో టీ20 ఫార్మాట్లో సూర్య ప్రదర్శనకుగాను అతడికి ఈ ఆవార్డు వరించింది. గతేడాది 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్య 155.95 స్ట్రైక్ రేటుతో 733 రన్స్ చేశాడు.
అంతేకాకుండా ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. దీంతో ఐసీసీ క్యాప్ అండ్ అవార్డ్ తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బుధవారం షేర్ చేశాడు. 'గ్రేట్ఫుల్' అంటూ మిస్టర్ 360 చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును వరుసగా రెండోసారి అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా సూర్య నిలిచాడు.
ఇక టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సూర్య నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 861 రేటింగ్ పాయింట్లతో సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తరువాత వరుసగా ఫిలిప్ సాల్ట్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, మార్క్రమ్ ఉన్నారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం సూర్యకుమార్ టీ20 వరల్డ్‌కప్‌కి సన్నద్ధమవుతున్నాడు. టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా బృందంతో ఇప్పటికే అమెరికా చేరుకున్నాడు.
నం.01 ర్యాంకుతోనే టీ20 వరల్డ్‌కప్‌లోకి టీమిండియా
టీ20 వరల్డ్‌కప్‌లోకి భారత జట్టు నం.01 ర్యాంకుతోనే అడుగుపెట్టనుంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీమ్ ర్యాంకుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ ఉన్నాయి. వీటిలో ఇంగ్లండ్, విండీస్ ఇప్పటివరకు చెరో రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచాయి. ఇక భారత్, ఆసీస్ ఒక్కోసారి టైటిల్ నెగ్గాయి.