Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు కాంగ్రెస్ ప్రత్యేక విజ్ఞప్తి

Congress Kerala unit has appealed to legendary Bollywood actor Amitabh Bachchan to highlight the urgent need for more trains
  • కిక్కిరిసిన రైళ్ల సమస్యపై ట్వీట్ చేయాలంటూ అభ్యర్థన
  • మీ నుంచి ఈ సాయాన్ని కోరుతున్నామంటూ బిగ్ బీకి కేరళ కాంగ్రెస్ ట్వీట్
  • రైల్వే మంత్రిపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని రైళ్లను తక్షణమే పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేయాలంటూ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బిగ్ బీని కేరళ కాంగ్రెస్ అభ్యర్థించింది. జూన్ 1న ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విధంగా స్పందించింది.

‘‘ మీ నుంచి మాకు ఈ చిన్న సాయం కావాలి. కోట్లాది మంది సామాన్యులు ఈ విధంగా ప్రయాణించాల్సి వస్తోంది. రిజర్వ్ కంపార్ట్‌మెంట్లు సైతం జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రత 52 డిగ్రీలు దాటింది. గత దశాబ్దకాలంలో దేశ జనాభా 14 కోట్లు పెరిగింది. దామాషా ప్రకారం 1000 కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలి. కానీ వాటిలో సగం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో రైళ్లు నడుస్తున్నాయి. కొత్తగా కొన్ని వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి సరిపెట్టుకున్నాం’’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై కేరళ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రద్దీగా ఉన్న రైలు కంపార్ట్‌మెంట్‌ను చూపిస్తున్న 40 సెకన్ల వీడియోను ఈ సందర్భంగా కాంగ్రెస్ షేర్ చేసింది. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రయాణికులు అవస్థలు పడుతుండడం ఈ వీడియోలో కనిపించింది. ఉక్కపోత నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్లాస్టిక్ ఫ్యాన్లను ఉపయోగిస్తూ కనిపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌లో పరిస్థితులను ఈ వీడియో తెలియజేస్తోందని పేర్కొంది.

రైళ్ల సంఖ్యను పెంచాలంటూ చాలా అభ్యర్థనలు ఉన్నప్పటికీ రైల్వే మంత్రి వైష్ణవ్‌ స్పందించడం లేదని, సంపన్నుల సమస్యలపై మాత్రమే స్పందిస్తారని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘ మీ ప్రభావం, సామాజిక కారణాల పట్ల మీ నిబద్ధత దృష్ట్యా ఈ సమస్యపై ట్వీట్ చేయాలంటూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మీరు మద్దతు ఇస్తే అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రేరేపిస్తుందని భావిస్తున్నాం’’ అని పేర్కొంది.
Amitabh Bachchan
Congress
BJP
Indian Railways
Railway News

More Telugu News