Delhi: ఢిల్లీలో తీవ్ర నీటి కొరత.. అదనపు నీటి కోసం సుప్రీంకోర్టుకెక్కిన కేజ్రీవాల్ ప్రభుత్వం!
- హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనంగా నీటిని ఇప్పించాలని వినతి
- పిటిషన్ దాఖలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్
- దేశ రాజధాని దాహం తీర్చడం ప్రతిఒక్కరి బాధ్యతని వ్యాఖ్య
దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఎండలు భగ్గుమంటుండటంతో రోజువారీగా సరఫరా చేస్తున్న నీరు ప్రజలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు నీటిని అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
‘ఎండల వల్ల ఢిల్లీ నీటి అవసరాలు గణనీయంగా పెరిగాయి. దేశ రాజధాని దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని పిటిషన్ లో కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది.
ఢిల్లీలో కొన్ని రోజులుగా నీటి సమస్య అధికమైంది. ముఖ్యంగా చాణక్యపురిలోని సంజయ్ క్యాంప్ ప్రాంతంతోపాటు గీతా కాలనీ, మరికొన్ని చోట్ల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు.
కనీసం ఒక్క బకెట్ నీరు దొరుకుతుందన్న ఆశతో నీళ్ల ట్యాంకర్ల వద్ద ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాలకూ చాలినంత నీటి సరఫరా మాత్రం వుండడం లేదు. ఢిల్లీలో రెండు రోజుల కిందట ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు చేరడంతో నీటి కొరత ఎక్కువైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. ఇది సాధారణంకన్నా 2.8 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం.
మరోవైపు ఢిల్లీలో వడగాడ్పులు మరికొన్ని రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల ప్రజలు ఎండల్లో బయటకు తిరగరాదని సూచించింది. అలాగే ఎప్పుడూ తగినంత నీరు తాగుతుండాలని తెలిపింది.
ఇదిలావుంచితే, నీటి వృథాను అరికట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు కడగడం లాంటివి చేసే వారికి రూ. 2 వేల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. జరిమానాల వసూలు కోసం ఢిల్లీవ్యాప్తంగా 200 బృందాలను రంగంలోకి దింపింది.