Donald Trump: ‘హష్ మనీ కేసు’లో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump became the first former US president ever convicted of a crime

  • నేరానికి పాల్పడ్డ తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచిన ట్రంప్
  • జులై 11న శిక్షను ఖరారు చేయనున్న న్యాయస్థానం
  • ఎన్నికల ముందు ఎదురుదెబ్బ!

గతంలో తనతో ఏకాంతంగా గడిపిన విషయాన్ని బయటకు చెప్పకుండా పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పిన కేసులో (హష్ మనీ కేసు) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో ఆయనపై ఆరోపణలు గురువారం రుజువు అయ్యాయి. ఈ కేసులో ట్రంప్‌పై మొత్తం 34 అభియోగాలు నమోదవ్వగా అన్నీ నిర్ధారణ అయ్యాయి.

 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు నోరు మెదపకుండా ఉంచేందుకు స్టార్మీ డేనియల్స్‌కు డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత లాయర్ ద్వారా భారీగా డబ్బు ముట్టజెప్పారు. ఈ డబ్బుకు సంబంధించిన లెక్కలను ఎవరూ గుర్తించకుండా వ్యాపార రికార్డులను ట్రంప్ ఏమార్చారని తేలింది. ఈ మేరకు 12 మంది సభ్యుల జ్యూరీ 2 రోజుల 11 గంటలకు పైగా చర్చించి ఏకగ్రీవ తీర్పుని ఇచ్చింది. జులై 11న న్యూయార్క్ కోర్ట్ న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ శిక్షను ఖరారు చేయనున్నారు. దీంతో నేరానికి పాల్పడ్డ మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.

మరో 5 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టేనని అక్కడి రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే డొనాల్ట్ ట్రంప్‌నకు జైలుశిక్ష పడుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. నిబంధనల ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌నకు నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. జడ్జి విచక్షణ ఆధారంగా శిక్ష ఆధారపడి ఉంటుందని అమెరికా న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

మరోవైపు 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపు అనంతరం ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలను కూడా ట్రంప్ ఎదుర్కొంటున్నారు. వైట్‌హౌస్‌ను వీడి వెళ్లడానికి ముందు రహస్య పత్రాలను దాచుకున్నారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News