AB Venkateswara Rao: ఎట్టకేలకు గౌరవంగా... ఉద్యోగ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు
- ఈ ఉదయమే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ
- సాయంత్రానికి రిటైర్మెంట్
- శుభాకాంక్షలు తెలిపిన ద్వారకా తిరుమలరావు, పట్టాభి
సుదీర్ఘ న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు పోస్టింగ్ అందుకున్న ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. క్యాట్ ఉత్తర్వులను సమర్థిస్తూ, ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తుందా, లేదా? అనే ఉత్కంఠ ఈ ఉదయం వరకు కొనసాగింది. ఎందుకంటే, ఏబీ వెంకటేశ్వరావు ఇవాళ (మే 31) పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది.
ఈ ఉదయం విజయవాడలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ లో ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రానికి అదే హోదాలో గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, టీడీపీ నేత పట్టాభి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు సీనియారిటీ పరంగా ప్రస్తుతం పోలీస్ శాఖలో డీజీ ర్యాంకులో ఉన్నారు. గతంలో ఇంటెలిజన్స్ చీఫ్ గా ఉన్న ఆయన పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో వైసీపీ సర్కారు ఆయనపై రెండు పర్యాయాలు సస్పెన్షన్ విధించింది.
ఈ క్రమంలో ఏబీ పట్టువిడవకుండా న్యాయపోరాటం సాగించారు. ఆయన న్యాయపోరాటం ఫలించి.. క్యాట్ ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని ఏపీ హైకోర్టు స్పష్టం చేయడంతో... ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు.