Final Phase Polling: దేశంలో రేపే చివరి దశ పోలింగ్... అన్ని ఏర్పాట్లు పూర్తి
- భారత్ లో ఈసారి ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు
- ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ పూర్తి
- జూన్ 1న ఏడో దశ పోలింగ్
- 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
దేశంలో రేపు (జూన్ 1) చివరిదైన ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలతో పాటు, ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్ లో 13, పంజాబ్ లో 13, పశ్చిమ బెంగాల్ లో 9, బీహార్ లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్ లో 4, ఝార్ఖండ్ లో 3, ఛండీగఢ్ లో ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
చివరి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఉన్నారు.
ఏడో దశ పోలింగ్ లో 10.06 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. పోలింగ్ తీరును పర్యవేక్షించేందుకు 172 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు. 2,707 ఫ్లయింగ్ స్క్వాడ్లను... 2,799 స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ లు... 1,080 నిఘా బృందాలు, 560 వీడియో మానిటరింగ్ టీమ్ లను ఏర్పాటు చేశారు.
రహదారి తనిఖీల నిమిత్తం దాదాపు 1,100కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.