Vinukonda: ఏపీలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు... వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత

Highest temperatures recorded in AP

  • రాష్ట్రంలో భానుడి భగభగలు
  • ఏపీలో అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • రేపు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఏపీఎస్డీఎంఏ
  • కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
  • ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా

ఏపీలో ఇవాళ కూడా ఎండలు భగ్గుమన్నాయి. సూర్యుడు చండ్రనిప్పులు కురిపించడంతో నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పల్నాడు జిల్లా వినుకొండలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 

ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3, గుంటూరు జిల్లా ఫిరంగిపురం, తుళ్లూరులో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో రేపు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. 

శనివారం నాడు కూడా వడగాడ్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. 

ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని వెల్లడించింది.

  • Loading...

More Telugu News