Lok Sabha Polls 2024: నేటితో ముగియనున్న ఎన్నికలు.. సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపులు!

Elections will end today All eyes on evening for exit polls
  • దేశంలో ఏడు విడతలుగా ఎన్నికలు
  • నేడు చివరి విడతలో 57 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది
  • ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు
  • సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్
  • ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు
దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు  జరగనున్నాయి. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ సిటింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో బరిలో ఉన్నారు. 

వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోదీకి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌ గట్టిపోటీనే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి అంతకుమించి గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. బీహార్ రాజధాని పాట్నా, నలందా, పాటలీపుత్ర, అర్హా, ససారమ్, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాల్లోనూ గెలిచిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. 

సాయంత్రం కోసం ఎదురుచూపులు
నేటితో ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ సాయంత్రం ఎప్పుడవుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ద్వారా ఓటరు మనోగతాన్ని కొంతవరకు అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదనే దానిపై కొంత వరకు అవగాహనకు రావొచ్చని అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉంది. అధికార మార్పిడి జరుగుతుందా? లేదా? అన్నది అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
ఎగ్జిట్ పోల్స్ అన్ని వేళలా నిజం కాదని తెలిసినా సరే.. అందరూ వాటి కోసమే ఎదురుచూస్తుండడం గమనార్హం. 2004లో బీజేపీకి 240 నుంచి 250 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2015లో ఢిల్లీలో ‘ఆప్’ ఊడ్చేస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. 2017లో యూపీలో హంగ్ వస్తుందని చెప్పినా బీజేపీ ఘన విజయం సాధించింది. అంతమాత్రాన ఎగ్జిట్ పోల్స్ తప్పని చెప్పడానికి కూడా లేదు. చాలాసార్లు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. చూడాలి మరి.. ఈసారి ఏం జరుగుతుందో!
Lok Sabha Polls 2024
India
BJP
Congress
Narendra Modi
Exit Polls
AP Assembly Polls

More Telugu News