LPG: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్
- ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు
- ధరలను సవరించిన ఇంధన కంపెనీలు
- గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చిన్నపాటి శుభవార్త వచ్చింది. ధరల సవరణలో భాగంగా దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.
కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కు తగ్గింది. ఇక కోల్కతాలో రూ. 1,787, ముంబైలో రూ.1,629, చెన్నైలో రూ. 1,840లకు తగ్గాయి. మే 1న కూడా రూ.19 మేర, అంతకుముందు ఏప్రిల్లో రూ.30.50 మేర తగ్గింది. దీంతో ఆర్థిక సవాళ్ల మధ్య నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు ఈ నిర్ణయం కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.
కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు. ఇదిలావుంచితే.. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా తాజా ధరల సవరణ చేపట్టాయి.