Delhi Liquor Scam: మరో నెల రోజులు జైలులోనే కవిత.. కారణం ఇదే!

BRS MLC K Kavitha in jail for another month
  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితపై ఆరోపణలు
  • మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్
  • ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • బెయిలు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
  • నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు
  • వచ్చే నెల మొదటి వారంలో బెయిలు పిటిషన్‌పై తీర్పు!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైలులో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్టయ్యారు. తీహార్ జైలులో ఉండగానే సీబీఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిలు కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిలు కోసం కవిత పెట్టుకున్న పిటిషన్‌పై మే 27, 28న వాదనలు జరగ్గా తీర్పును కోర్టు రిజర్వు చేసింది.

ఈ నెలంతా సెలవులే
బెయిలుపై తీర్పును కోర్టు రిజర్వు చేయడంతో కవిత మరో నెల రోజులు జైలులో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వు చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు నిన్న బెయిలు పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. దీంతో కోర్టు సెలవులు ముగిశాక కానీ బెయిలుపై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. జూన్ 30 ఆదివారం కావడంతో జులై మొదటి వారంలోనే కవిత బెయిలు పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ నెల 3తో కవిత జుడీషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది.
Delhi Liquor Scam
K Kavitha
BRS
New Delhi
Tihar Jail
ED
CBI

More Telugu News