Narendra Modi: మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేద్దాం: ప్రధాని మోదీ

Let us make our democracy more vibrant and participative says PM Narendra Modi
  • యువత, స్త్రీలు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపు
  • లోక్‌సభ ఎన్నికల 7వ దశ ఓటర్లకు ప్రధాని మోదీ సందేశం
  • నేటితో ముగియనున్న లోక్‌సభ ఎన్నికలు-2024
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. కాగా చివరిదైన 7వ దశ పోలింగ్‌కు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు తన సందేశాన్ని ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతంగా, క్రియాశీలకంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ  మేరకు శనివారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. 

‘‘ 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేడు ముగింపు దశ. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి ఓటు వేయాలి. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠంగా, క్రియాశీలకంగా మార్చుదాం’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా నేడు (శనివారం) కొనసాగుతున్న 7వ దశ పోలింగ్‌లో సుమారు 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది స్త్రీలు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

కాగా నేడు జరుగుతున్న 7వ దశ లోక్‌సభ పోలింగ్‌లో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌-13, పంజాబ్‌-13, పశ్చిమ బెంగాల్-9, బీహార్‌-8, ఒడిశా-6, హిమాచల్ ప్రదేశ్‌- 4, ఝార్ఖండ్‌- 3, చండీగఢ్‌- 1 స్థానం చొప్పున పోలింగ్ కొనసాగుతోంది.
Narendra Modi
Lok Sabha Polls
7th Phase Election

More Telugu News