EVM: ఈవీఎంలను ఎత్తుకెళ్లి నీటి కుంటలో పడేసిన గ్రామస్థులు.. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Violence During Final Phase Voting In Bengal EVM Tossed Into Pond
  • గ్రామస్థులు ఎత్తుకెళ్లిన ఈవీఎంలు అదనంగా ఏర్పాటు చేసినవన్నఈసీ
  • పోలింగ్ యాథావిధిగా జరుగుతోందని వివరణ
  • రాష్ట్రంలో అక్కడక్కడా ఉద్రిక్తతలు
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శనివారం ఆఖరి దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజధాని కోల్ కతాకు సమీపంలోని జాదవ్ పూర్ నియోజకవర్గంలో సీపీఎం, ఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ బూత్ లోకి చొరబడిన జనం.. ఈవీఎంతో పాటు ఎన్నికల సామగ్రిని ఎత్తుకెళ్లి దగ్గర్లోని నీటి కుంటలో పడేశారు. భాన్ గర్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఏఐఎస్ఎఫ్ అభ్యర్థికి చెందిన వాహనాన్ని టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

దక్షిణ 24 పరగణాల జిల్లా జయ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని కుల్తాలీలో పోలింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్ లోకి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మూకుమ్మడిగా పోలింగ్ బూత్ లోకి చొరబడి ఎన్నికల సామగ్రిని చెల్లాచెదురు చేశారు. ఓ ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మెషిన్లను ఎత్తుకెళ్లారు. వాటిని దగ్గర్లోని ఓ నీటి కుంటలో పడేశారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టారు. నీటిలో పడేసిన ఎన్నికల సామగ్రిని వెలికితీశారు.

అయితే, కుల్తాలీలో ముందు జాగ్రత్త చర్యగా అదనంగా ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్లనే నీటి కుంటలో పడేశారని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కుల్తాలీ పోలింగ్ బూత్ లో పోలింగ్ యథావిధిగా జరుగుతోందని స్పష్టం చేసింది. సెక్టార్ ఆఫీసర్ కు మరో ఈవీఎంను అందజేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై కుల్తాలీ సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొంది. పోలింగ్ బూత్ వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది.
EVM
Tossed into Pond
West Bengal
Polling Violence
Final Phase
Voting

More Telugu News