Marian Robinson: మిచెల్ ఒబామాకు మాతృవియోగం!
- మిచెల్ ఒబామా తల్లి మరియన్ రాబిన్సన్ కన్నుమూత
- ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 8 ఏళ్లు వైట్‌హౌస్‌లో ఉన్న మరియన్
- ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా సంరక్షణ బాధ్యత ఆమెదే
- మరియన్ మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట విషాదం నెలకొంది. మాజీ ప్రథమ మహిళ, ఒబామా భార్య మిచెల్ ఒబామా తల్లి మరియన్ రాబిన్సన్ శుక్రవారం కన్నుమూశారు. ఆమెకు ప్రస్తుతం 86 ఏళ్లు. ఆమె మృతి విషయాన్ని బరాక్, మరియన్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుమార్తె, అల్లుడితో కలిసి ఎనిమిదేళ్లు మరియన్ రాబిన్సన్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా సంరక్షణను ఆమే చూసుకున్నారు. మరియన్‌ను కుటుంబ సభ్యులు ముద్దుగా 'మొదటి బామ్మ' అని పిలుచుకుంటారు.
ఇక మరియన్ మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మరియన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక షికాగోలో 1937లో జన్మించిన రాబిన్సన్ ఆ ఇంట్లో ఏడుగురు పిల్లలలో ఒకరు. ఆమె యుక్తవయసులో ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. నల్ల జాతీయులు కావడంతో యునైటెడ్ స్టేట్స్‌లో జాతి వివక్ష ఎదుర్కొన్నారు. ఆమె తండ్రి చర్మం రంగు కారణంగా యూనియన్‌లో చేరడానికి, పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడానికి అనుమతించబడలేదు.
అయినప్పటికీ, బరాక్ ఒబామా మొదటి నల్లజాతి అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఆమె తన కుమార్తె, అల్లుడితో కలిసి శ్వేతసౌధం చేరుకున్నారు. రాబిన్సన్ 1960లో వివాహం చేసుకున్నారు. ఆమెకు మిచెల్ ఒబామా సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా, కార్యదర్శిగా కూడా పనిచేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.