Lok Sabha Polls: లోక్‌సభ తుది దశ పోలింగ్‌.. మధ్యాహ్నం 3 వరకు 49 శాతం పోలింగ్‌ నమోదు

49 percent voter turnout recorded till 3 pm in the 7th phase of election
  • 57 స్థానాలకు జరుగుతున్న తుది ద‌శ‌ పోలింగ్‌
  • అత్యధికంగా ఝార్ఖండ్‌లో 60.14 శాతం పోలింగ్‌ నమోదు
  • ఇవాళ పోలింగ్ పూర్త‌యిన అనంత‌రం సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌
లోక్‌సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 57 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌ మరికాసేపట్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా ఝార్ఖండ్‌లో 60.14 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ త‌ర్వాత పశ్చిమ బెంగాల్‌లో 58.46 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 58.41 శాతం, చండీగఢ్‌లో 52.61 శాతం, ఒడిశాలో 49.77 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 46.83 శాతం, పంజాబ్‌లో 46.38 శాతం, బీహార్‌లో 42.95 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

ఇక ఆఖ‌రిదైన ఏడో దశలో భాగంగా పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3 స్థానాలతో పాటు చండీగఢ్‌ స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడ‌నున్నాయి. అయితే, ఇవాళ తుది ద‌శ‌ పోలింగ్ పూర్త‌యిన అనంతరం సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Lok Sabha Polls
7th phase
India

More Telugu News