T20 World Cup: టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు
- రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్
- అమెరికా, వెస్టిండీస్ దేశాల సంయుక్త ఆతిథ్యం
- న్యూయార్క్ లో నేడు టీమిండియా × బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా నేడు బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఇక్కడి నాసావ్ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది.
ఒకటిన్నర ఏడాది విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ అర్థసెంచరీతో రాణించడం సానుకూల అంశం. పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడి 23 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఓపెనర్ గా దిగిన సంజూ శాంసన్ కేవలం 1 పరుగుకే వెనుదిరిగాడు. శివమ్ దూబే 14 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 1, షోరిఫుల్ ఇస్లామ్ 1, మహ్మదుల్లా 1, తన్వీర్ ఇస్లామ్ 1 వికెట్ తీశారు.