Somnath Bharti: మోదీ మూడోసారి ప్రధాని అయితే నేను గుండు చేయించుకుంటా: ఆప్‌ నేత సోమనాథ్ భారతి

I will shave off my head if Mr Modi becomes PM for the third time  says Aam Aadmi Party leader Somnath Bharti
  • నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత
  • బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేశారని వ్యాఖ్య
  • ఎగ్జిట్ పోల్స్ తప్పు అని జూన్ 4న రుజువు అవుతుందని దీమా
  • ఇండియా కూటమి 295కిపైగా స్థానాల్లో గెలుస్తుందన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
లోక్‌సభ ఎన్నికలు పూర్తవడంతో శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో మరోసారి ఎన్డీయే సర్కారు రాబోతోందని ఘంటాపథంగా చెప్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారని పేర్కొన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే మాట చెప్పాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే గెలవబోదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఇండియా కూటమి అభ్యర్థి సోమనాథ్ భారతి అన్నారు. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే తాను గుండు గీయించుకుంటానని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

‘‘ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే నేను గుండు గీయించుకుంటాను. నా మాటలను గుర్తుపెట్టుకోండి!. అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అని జూన్ 4న రుజువవుతుంది. మోదీ తిరిగి ప్రధాని కాలేరు. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్‌కు మోదీ భయం ఉంది. అందుకే ఆయన ఓడిపోతారని చెప్పలేదు. ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా భారీగా ఓటు వేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.

మరో ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఎగ్జిట్ పోల్స్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎగ్జిట్స్ పోల్స్‌లో అవకతవకలు జరిగాయని, అసలు ఓటరు సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా లేవని విమర్శించారు. ఈ ఎగ్జిట్ పోల్‌ను బీజేపీ కార్యాలయంలో సిద్ధం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడులో బీజేపీకి 34 శాతం ఓట్లు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆప్‌కి ఒక్క సీటు రాదంటే ఎవరు నమ్ముతారని అన్నారు. ఇండియా కూటమి నేతలు పంచుకున్న ‘జనతా కా ఎగ్జిట్ పోల్’ ప్రకారం తమ కూటమి 295కిపైగా స్థానాలను గెలుస్తుందని సంజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Somnath Bharti
Narendra Modi
Lok Sabha Polls
BJP
AAP
Delhi

More Telugu News