Arunachal Pradesh: దేశమంతా జూన్ 4నే కౌంటింగ్... ఆ రెండు రాష్ట్రాల్లో మాత్రం నేడే ఎన్నికల ఫలితాలు
- భారత్ లో ఏప్రిల్ 26 నుంచి జూన్ 1 వరకు సార్వత్రిక ఎన్నికలు
- ముగిసిన పోలింగ్
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
- అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల కాలపరిమితి నేటితో ముగింపు
- అందుకే ఇవాళే ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి
భారత్ లో ఐదేళ్లకోసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఈసారి మొత్తం 7 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 26న తొలి దశ పోలింగ్ జరగ్గా, జూన్ 1న చివరిదైన ఏడో దశ పోలింగ్ జరగడంతో, ఓటింగ్ సమరం ముగిసింది. ఇక జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మాత్రం ఇవాళే కౌంటింగ్ జరిగింది.
ఎందుకంటే... నేటితో ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తోంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్లను ఇవాళే లెక్కించారు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా, సిక్కింలో ఎస్కేఎమ్ పార్టీ (సిక్కిం క్రాంతికారీ మోర్చా) మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ లో ఫలితాలను చూస్తే... బీజేపీకి 46, ఎన్పీపీకి 5, ఎన్సీపీకి 3, పీపీఏకి 2, కాంగ్రెస్ కు 1, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 3 స్థానాలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. 10 సీట్లు బీజేపీకి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 50 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.
ఇక సిక్కింలో చూస్తే... మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 32. తుది ఫలితాల అనంతరం అధికార ఎస్కేఎమ్ పార్టీకి 31 స్థానాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) కు 1 స్థానం లభించింది.
ఎస్డీఎఫ్ 2019 వరకు సిక్కింను పాతికేళ్ల పాటు పాలించింది. ఆ పార్టీ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ దేశంలోనే సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి రికార్డు ఉన్న చామ్లింగ్ తాజా ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 1985 నుంచి ఓటమన్నది లేకుండా వరుసగా 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చామ్లింగ్ కు ఇదే తొలి ఓటమి.