Jairam Ramesh: ఈసీ నోటీసులు.. చిక్కుల్లో జైరాం రమేశ్!
- కౌంటింగ్ నేపథ్యంలో హోం మంత్రి కలెక్టర్లకు ఫోన్ చేశారని జై రామ్ రమేశ్ ఆరోపణలు
- ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలంటూ ఈసీ లేఖ
- జై రామ్ రమేశ్ వ్యాఖ్యలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వ్యాఖ్య
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేసిన జైరాం రమేశ్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈసీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అమిత్ షాపై ఆరోపణల తాలూకు ఆధారాలు చూపాలని కోరింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్‌లకు ఫోన్ చేశారని జై రామ్ రమేశ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
‘‘మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఒక జాతీయ పార్టీలో సీనియర్ నాయకులు. మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు సమర్పించండి. కౌంటింగ్ కు ముందు 150 మంది జిల్లా కలెక్టర్లకు హోం మంత్రి ఫోన్ కాల్స్ చేశారనడానికి తగిన ఆధారాలు చూపండి. ఆ తరువాత తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఈసీ తన లేఖలో పేర్కొంది.
‘‘హోం మంత్రి ఇప్పటివరకూ 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై నిఘా పెట్టారు. బెదిరింపులకు దిగుతున్నారు. విజయంపై బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా అర్థమవుతోంది. ప్రజల అభీష్టమే గెలుస్తుంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది’’ అని జై రామ్ రమేశ్ ఎక్స్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.