Helen Mary Roberts: పాకిస్థాన్ దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. మహిళా బ్రిగేడియర్ నియామ‌కం!

Pakistan Army gets minority woman brigadier in historic first

  • తొలి మహిళా బ్రిగేడియర్‌గా డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్
  • 1998 నుండి పాక్‌ ఆర్మీలో పనిచేస్తున్న హెలెన్ 
  • బ్రిగేడియర్‌ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా చరిత్ర
  • హెలెన్‌కు పదోన్నతిపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ హ‌ర్షం

ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా క్రైస్తవ మైనారిటీకి చెందిన డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్ నియ‌మితుల‌య్యారు. పాక్‌ ఆర్మీ మెడికల్‌ కోర్‌లో పనిచేస్తున్న రాబర్ట్స్‌ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. పాకిస్థాన్‌ సైన్యంలో బ్రిగేడియర్‌ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. సీనియర్‌ పాథాలజిస్ట్‌ అయిన మేరీ రాబర్ట్స్ పాక్‌ ఆర్మీలో 1998 నుంచి ప‌నిచేస్తున్నారు. అంటే దాదాపు 26 ఏళ్లుగా ఆమె ఆర్మీలో సేవ‌లు అందిస్తున్నారు. 

మరోవైపు హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌కు బ్రిగేడియర్‌గా పదోన్నతి లభించినందుకు ఆ దేశ‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు అభినందనలు తెలియ‌జేశారు. "పాకిస్థాన్‌ ఆర్మీలో బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందిన మైనారిటీకి చెందిన మొదటి మహిళగా గౌరవం పొందినందుకు నేను, దేశం.. హెలెన్ మేరీ రాబర్ట్స్‌ను అభినందిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఇక గత ఏడాది రావల్పిండిలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ దేశాభివృద్ధిలో మైనార్టీ కమ్యూనిటీ పోషించిన పాత్రను ప్రశంసించిన విష‌యం తెలిసిందే. కాగా, పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2021లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో 96.47 శాతం ముస్లింలు ఉండగా.. 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు, 0.09 శాతం అహ్మదీ ముస్లింలు, ఇతరులు 0.03 శాతం మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News