Mamata Banerjee: ఇంట్లో వండి వడ్డించిన వంటకాలే ఎగ్జిట్ పోల్స్: దీదీ

What Mamata Banerjee Said On Exit Polls Showing BJP Ahead Of Trinamool In Bengal
  • బెంగాల్ ఫలితాల అంచనాలపై మమతా బెనర్జీ రియాక్షన్
  • గత ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదని వ్యాఖ్య
  • దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని జోస్యం
  • మెజారిటీ సీట్లు బీజేపీ గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా
రెండు నెలల కిందటే ఇంట్లో వండి తాజాగా వడ్డించిన వంటకాలే ‘ఎగ్జిట్ పోల్స్’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విలువే లేదని కొట్టిపారేశారు. గత ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాలేదని దీదీ గుర్తుచేశారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగిందని, ఫలితాల్లో ఆ విషయం బయటపడుతుందని జోస్యం చెప్పారు. ఈమేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగిందని, రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వెనకకు నెట్టి బీజేపీ ముందంజలో ఉంటుందని తెలిపాయి. ఈ అంచనాలపై ఏమనుకుంటున్నారని మమతా బెనర్జీని అడగగా.. గ్రౌండ్ రియాలిటీకి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భారీ వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. 2016, 2019, 2021 లలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైందని వివరించారు.

ఆ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈసారి కూడా బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయని వివరించారు. బెంగాల్ లో మాత్రమే కాదు తమిళనాడులో స్టాలిన్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్, బీహార్ లో తేజస్వీ యాదవ్ మ్యాజిక్ చేస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని వివరించారు. అయితే, బెంగాల్ లో టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి మేలు చేకూర్చేందుకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పనిచేశాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
Mamata Banerjee
West Bengal
Exit Polls
BJP
India Allience
Lok Sabha Polls Results

More Telugu News