Ruben Trumpelmann: 2,633 టీ20 మ్యాచ్‌ల్లో తొలిసారి.. వరల్డ్ కప్‌లో నమీబియా బౌలర్ నయా చరిత్ర

Namibia player Ruben Trumpelmann has created a never seen before record in the history of T20I cricketNamibia player Ruben Trumpelmann has created a never seen before record in the history of T20I cricket
  • ఇన్నింగ్స్ తొలి 2 బంతులకు 2 వికెట్లు తీసిన బౌలర్‌గా రూబెన్ ట్రంపెల్‌మాన్ నయా చరిత్ర
  • టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
  • సూపర్ ఓవర్‌లో ఒమన్‌పై ఉత్కంఠ భరిత విజయం సాధించిన నమీబియా
వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్-2024లో నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ టీ20 క్రికెట్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎరుగని సరికొత్త రికార్డును సృష్టించాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా ఒమన్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో చారిత్రాత్మక ప్రదర్శన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్‌ను ఇన్నింగ్స్ ఆరంభంలోనే రూబెన్ గట్టి దెబ్బ కొట్టాడు. ఒమన్ ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. తొలి బంతికి ఓపెనర్ ప్రజాపతి, ఆ మరుసటి బంతికి కెప్టెన్ అకిబ్ ఇలియాస్‌‌లను పెవీలియన్‌కు పంపించాడు. ఇద్దరినీ గోల్డెన్ డకౌట్‌ చేశాడు. ఈ విధంగా టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్ ఆరంభ తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా రూబెన్ ట్రంపెల్‌మాన్ నిలిచాడు. 2,633 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సూపర్ ఓవర్‌లో నమీబియా థ్రిల్లింగ్ విక్టరీ
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో గ్రూప్-బీలో భాగంగా సోమవారం బార్బడోస్‌‌లోని కెన్సింగ్టన్ ఓవర్ మైదానం వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమ‌న్ 19.4 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 110 ప‌రుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన న‌మీబియా నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి సరిగ్గా 109 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.  ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఒమ‌న్ 1 వికెట్ న‌ష్టానికి 10 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. దీంతో నమీబియా ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Ruben Trumpelmann
T20 World Cup 2024
T20 World Cup
Cricket
Namibia vs Oman

More Telugu News