Election Commission: మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు: తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

Counting of votes to begin at 8 am today
  • మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ప్రకటించాలని ఈసీని కలిసిన విపక్షాలు
  • అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ స్పష్టీకరణ
  • 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లను మొదట లెక్కిస్తారని వెల్లడి
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఆదివారం ఈసీని కలిశారు.

ఈ క్రమంలో, రూల్ 54A ప్రకారం అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదట ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారని వెల్లడించింది. కౌంటింగ్‌కు ఫారమ్ 17సీతో పాటు ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్లు ఉండాలి.

543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ట్రెండింగ్, ఫలితాలను ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో చూడవచ్చు. వోటర్ హెల్ప్ లైన్ యాప్‌లోనూ అందుబాటులో ఉంటాయని ఈసీ తెలిపింది.

ఇదిలా ఉండగా, మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే విపక్షాలు ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్నాయి. ఇండియా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Election Commission
Lok Sabha Polls
BJP
Congress
Telugudesam
YSRCP
BRS

More Telugu News