Telangana: హ్యాకింగ్ బారినపడిన తెలంగాణ పోలీస్ 'హాక్-ఐ'... హ్యాకర్ల చేతికి కీలక సమాచారం!
- సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన హాక్ఐ
- హాక్ఐలో 2 లక్షల మంది ఆధార్, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు
- కేసు నమోదు చేసుకొని... హ్యాకర్ల కోసం గాలిస్తున్న పోలీసులు
తెలంగాణ పోలీస్ 'హాక్-ఐ' యాప్ హ్యాకింగ్ బారిన పడింది. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ హ్యాకింగ్‌కు గురి కావడంతో కీలక సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లింది. ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్‌లో దాదాపు 2 లక్షల మంది ఆధార్, ఫోన్ నెంబర్లతో పాటు ఇతర వివరాలు ఉన్నాయి. ఈ సమాచారం అపహరణకు గురైనట్లుగా భావిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. హ్యాకర్ల కోసం గాలిస్తున్నారు. అపహరణకు గురైన సమాచారంతో హ్యాకర్లు బెదిరింపులకు పాల్పడే అవకాశముందని భావిస్తున్నారు.