T20 World Cup: టీ20 వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్ జోరుకు కళ్లెం వేసిన ఉగాండా
- టీ20 వరల్డ్ కప్ లో నేడు ఆఫ్ఘనిస్థాన్ × ఉగాండా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఉగాండా
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసిన ఆఫ్ఘన్
- చివరి ఓవర్లలో ధాటిగా ఆడలేకపోయిన ఆఫ్ఘన్ జట్టు
టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ ఆఫ్ఘనిస్థాన్, ఉగాండా జట్లు తలపడుతున్నాయి. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆఫ్ఘనిస్థాన్ జట్టును... తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న ఆఫ్రికా పసికూన ఉగాండా సమర్థంగా కట్టడి చేసింది.
గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఉగాండా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం లభించింది. ఆఫ్ఘన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 154 పరుగులు జోడించారు. గుర్బాజ్ 76, ఇబ్రహీం 70 పరుగులతో రాణించారు.
అయితే, కెప్టెన్ బ్రయాన్ మసాబా ఈ జోడీని విడదీశాడు. అప్పటికి ఆఫ్ఘన్ స్కోరు 14.3 ఓవర్లలో 154/1. అక్కడ్నించి ఆఫ్ఘన్ కు పరుగులు ఏమంత సులభంగా రాలేదు. చివరికి ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేయగలిగింది.
ఓ దశలో స్కోరు 200 దాటడం ఈజీ అనిపించినా, ఉగాండా బౌలర్లు చివరి ఓవర్లలో కట్టడి చేశారు. ఉగాండా బౌలర్లలో కెప్టెన్ మసాబా 2, కాస్మాస్ కెవుటా 2, అల్పేష్ రంజానీ 1 వికెట్ తీశారు.