Andhra Pradesh: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ.. 127 స్థానాల్లో టీడీపీదే గెలుపని తేల్చేసిన ట్రెండ్స్

There is no place to YCP in Krishna and Guntur Districts

  • చాలా జిల్లాల్లో ఉనికి కోసం పాకులాడుతున్న వైసీపీ
  • రాయలసీమలో 52 స్థానాలకు గాను 41 చోట్ల కూటమి అభ్యర్థుల హవా
  • మొత్తంగా 152 స్థానాల్లో కూటమి ముందంజ
  • శ్రీకాకుళంలో ఒక్క చోట మాత్రమే వైసీపీ ఆధిక్యం
  • 21 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో ఆధిక్యంలో జనసేన

గత ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన పరిస్థితే ఇప్పుడు అధికార వైసీపీకి ఎదురవుతోంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తోంది. దాని దెబ్బకు చాలా జిల్లాల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు స్థానాల్లో ఉనికి చాటుకుంటుండగా, కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగు రౌండ్లు ముగిసినా ఇంకా ఖాతా తెరవలేకపోయింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. ఆ జిల్లాల్లో టీడీపీ కూటమి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒక్క కడపలో మాత్రమే వైసీపీ 5 స్థానాల్లో ముందంజలో ఉండగా టీడీపీ మూడు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 152 స్థానాల్లో టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా 127 స్థానాల్లో గెలుపు ఖాయమని తేలిపోయింది. 

శ్రీకాకుళంలోని 10 స్థానాల్లో 8 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా బీజేపీ, వైసీపీ చెరో స్థానంలో ముందంజలో ఉన్నాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కృష్ణాలో 16 స్థానాలకు గాను టీడీపీ 13, జనసేన 2, బీజేపీ ఒక స్థానంలో, ప్రకాశంలో 12 స్థానాలకు గాను 8 స్థానాల్లో టీడీపీ, నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. గుంటూరులో 17 స్థానాలకు గాను 16 సీట్లలో టీడీపీ, ఒక స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉంది. అనంతపురంలో 14 స్థానాలకు గాను టీడీపీ 12, వైసీపీ 2, నెల్లూరులో 10 స్థానాలకు గాను టీడీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాయలసీమలో మొత్తం 52 స్థానాల్లో కూటమి 41 చోట్ల ముందంజలో ఉంది.

  • Loading...

More Telugu News