Rahul Gandhi: రెండు చోట్లా లక్ష పైచిలుకు ఓట్లతో రాహుల్ గాంధీ లీడ్
- వయనాడ్ లో 1.86 లక్షలు, రాయ్ బరేలీలో 1.24 లక్షల ఓట్లతో ముందంజ
- ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి హవా
- 36 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్న ఎస్పీ అభ్యర్థులు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా రెండు స్థానాల నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. సిట్టింగ్ సీటు కేరళలోని వయనాడ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని పార్టీ కంచుకోట రాయ్ బరేలీ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఫలితాలలో ఆయన రెండు చోట్లా లీడ్ లో కొనసాగుతున్నారు. వయనాడ్, రాయ్ బరేలీలో తన సమీప ప్రత్యర్థుల కన్నా లక్ష పైచిలుకు ఓట్లతో దూసుకుపోతున్నారు. వయనాడ్ లో సీపీఐ నేత అన్నె రాజా కన్నా 1,86,265 ఓట్లతో ముందంజలో ఉండగా.. రాయ్ బరేలీలో బీఎస్పీ నేత ఠాకూర్ ప్రసాద్ కన్నా 1,24,629 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తోంది. కూటమి మద్దతుతో సమాజ్ వాదీ పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు మొత్తం 36 చోట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. అమేథీ బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 48 వేల ఓట్లతో వెనుకంజలో ఉండగా.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి (ఇండియా కూటమి) కిశోర్ లాల్ శర్మ లీడ్ లో దూసుకెళుతున్నారు. అధికార పార్టీ బీజేపీ అభ్యర్థులు మొత్తంగా 33 చోట్ల లీడ్ లో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకు గానూ ఎస్పీ 36, బీజేపీ 33, కాంగ్రెస్ 8, ఆర్ఎల్డీ 2, ఇతరులు 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు.