Bandi Sanjay: కరీంనగర్ నుంచి గెలిచిన అనంతరం బండి సంజయ్ ఏమన్నారంటే...!

Bandi Sanjay responds after winning from karimnagar
  • అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ గెలవాల్సింది.. కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మారని వ్యాఖ్య
  • తాను చేసిన పోరాటాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తించి ఇప్పుడు గెలిపించారన్న బండి సంజయ్
  • ఆరు గ్యారెంటీల అమలు కోసం తాను పోరాడుతానని ప్రజలు నమ్మారని వ్యాఖ్య
అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ గెలవాల్సిందని... కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుపై 2.25 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. కరీంనగర్ నుంచి గెలిచిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా సమయంలో కరీంనగర్ ప్రజల కోసం తాను పని చేశానని, పేద ప్రజల కోసం తాను పోరాడానని... అందుకే ప్రజలు తనను గెలిపించారన్నారు.

శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌పై కోపంతో ఉన్న ప్రజలు బీజేపీని గెలిపించాలని భావించారన్నారు. కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం తాను పోరాడుతానని నమ్మి ప్రజలు తనను గెలిపించారన్నారు.
Bandi Sanjay
BJP
Lok Sabha Polls
Karimnagar District

More Telugu News