Narendra Modi: ఏపీ, ఒడిశాలలో చరిత్ర సృష్టించాం: ప్రధాని మోదీ

PM Modi claims historic feat as BJP relies on partners to form government

  • 1962 తర్వాత ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాలేదన్న మోదీ
  • మూడోసారి గెలిచి ఎన్డీయే కూడా చరిత్ర సృష్టించిందని వ్యాఖ్య
  • చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో గొప్ప గెలుపు సాధించామన్న మోదీ
  • సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలన్న ప్రధాని
  • 2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని విమర్శ

1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదని... మరోసారి గెలిచి ఎన్డీయే చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో గొప్ప గెలుపును సాధించామన్నారు. రాష్ట్రాలలో ఎన్డీయేకు గొప్ప విజయం దక్కిందని పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో చరిత్రను సృష్టించామన్నారు.  ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమన్నారు. కశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. బీజేపీకి దేశ ప్రజలు అద్భుత విజయం అందించారని వ్యాఖ్యానించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం గెలిచిందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని పేర్కొన్నారు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూశాయన్నారు.

2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని విమర్శించారు. తాము రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల క్రతువులో పాల్గొన్న ప్రతి ఓటరుకూ ప్రధాని అభినందనలు తెలిపారు. పూరీ జగన్నాథుడి ఆశీస్సులతో ఒడిశాలో బీజేపీకి విజయం దక్కిందన్నారు.

  • Loading...

More Telugu News