Prashant Kishor: ఏపీలో ఏం జరగనుందో ప్రశాంత్ కిశోర్ ముందే చెప్పాడు!

Prashant Kishor predicts correctly what will be happened in AP
  • ఏపీలో ముగిసిన కౌంటింగ్ ఘట్టం
  • ప్రభంజనం సృష్టించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి
  • కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైసీపీ
ఏపీలో ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు సైతం దిగ్భ్రాంతిని కలిగించాయి. జగన్ నాయకత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ పరిస్థితిని ముందే అంచనా వేశారు. ఆయన గత కొన్నిరోజులుగా ఇదే విషయాన్ని పదే పదే పలు వేదికలపై చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాల రోజున జగన్ మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. నిన్న కౌంటింగ్ మొదలైన రెండు గంటల్లోనే ఆ విషయం స్పష్టమైంది. 

ప్రశాంత్ కిశోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఓసారి పరిశీలిస్తే... "ఏపీలో జగన్ ఓటమి ఖాయమైంది. పోలింగ్ సరళిని వైసీపీ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా పదేళ్ల అనుభవంతో చెబుతున్నా... ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోంది. దేశంలో ఎక్కడ ఎవరు ఓడిపోతారు? అనేది నేను అంచనా వేయగలను. జగన్ పార్టీ విషయంలో కూడా నా అంచనాలు తప్పవని అనుకుంటున్నాను. 

సహజంగానే ఎవరూ కూడా ఎన్నికల ఫలితాల ముందే... మేం ఓడిపోతాం అని అంగీకరించరు. జగన్ పార్టీ కూడా అంతే. గతంలో కంటే జగన్ ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాడు... కానీ, కౌంటింగ్ రోజు ఫలితాలు జగన్ కు దిగ్భ్రాంతి కలిగిస్తాయి... ఏపీలో గెలిచేది టీడీపీ" అని తన విశ్లేషణలను పలు ఇంటర్వ్యూల్లో వినిపించారు. 

ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ మాటే నిజమైంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో... టీడీపీ 135, జనసేన 21, వైసీపీ 11, బీజేపీ 8 స్థానాలు గెలిచాయి. 25 లోక్ సభ స్థానాలకు కూటమి 21 స్థానాలు గెలిస్తే, వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది.
Prashant Kishor
Andhra Pradesh
Results
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News