Nitish Kumar: ఒకే ఫ్లైట్ లో ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలు నితీశ్, తేజస్వీ

Nitish Kumar Tejashwi Yadav On Same Flight

  • ఢిల్లీలో జరిగే సమావేశాలకు బయలుదేరనున్న బీహార్ నేతలు
  • ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్ కుమార్
  • మాజీ సహచరుడితో ప్రయాణంపై టెన్షన్

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో చంద్రబాబు, నితీశ్ లు కింగ్ మేకర్లుగా మారారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ నేతల మద్దతు బీజేపీకి తప్పనిసరి. ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఈ నేతలు ఇద్దరూ జతకట్టిన విషయం తెలిసిందే. తొలుత ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీశ్ కుమార్.. చివరి క్షణంలో ఎన్డీఏ కూటమిలోకి జంప్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి సమావేశాలు ఏర్పాటు చేశాయి. మిత్రపక్షాలతో కలిసి చర్చించేందుకు రెండు కూటములు మీటింగ్ పెట్టుకున్నాయి. అయితే, ఈ మీటింగ్ కు బీహార్ నుంచి నితీశ్ కుమార్, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ బుధవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. 

ఇండియా కూటమిలో సహచరులుగా, బీహార్ లో కొన్నిరోజుల పాటు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్, తేజస్వీలు ఒకే ఫ్లైట్ లో ప్రయాణించనున్నారు. దీంతో నితీశ్, తేజస్వీల మధ్య చర్చ జరిగే అవకాశం లేకపోలేదని, ఎప్పటికప్పుడు పొత్తులు మార్చడంలో పేరుమోసిన నితీశ్ కుమార్ ఏం చేయనున్నాడోనని రాజకీయ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది. కొంతకాలం కిందట సహచరులుగా, ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న నితీశ్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించడం ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన బీజేపీ వర్గాల్లో నెలకొన్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన వేళ ఈ ప్రయాణం నితీశ్ కుమార్ ను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News