Chandrababu: కేంద్రంలో కింగ్ మేకర్లుగా చంద్రబాబు, నితీశ్ కుమార్!

Chandrababu Nitish Kumar turns king makers follwing surprising election results

  • కేవలం 240 సీట్లతో మ్యాజిక్ ఫిగర్‌ కు దూరంగా నిలిచిన బీజేపీ
  • ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన ఎన్డీయే భాగస్వాములు చంద్రబాబు, నితీశ్ కుమార్
  • ఇండియా కూటమి నేతలు టీడీపీ, జేడీయూతో టచ్‌లో ఉన్నారన్న వార్తలతో కలకలం
  • తాము ఎన్డీయేతోనే ప్రయాణిస్తామన్న నారా లోకేశ్

దేశంలో బీజేపీకి ఎదురేలేదన్న ప్రచారపు హోరు నడుమ జరిగిన పార్లమెంటు ఎన్నికల తరువాత పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు రాగా రాజకీయ దురంధరులుగా పేరుపడ్డ చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు మరోసారి కేంద్రంలో కింగ్ మేకర్లుగా మారారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని కారణంగా ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు, మనుగడకు కీలకం కానున్నారు.  

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, బీజేపీ 240 సీట్లు, టీడీపీ 16, నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 12 సీట్లు దక్కించుకున్నాయి. ఇతర భాగస్వాములను కూడా కలుపుకుంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటవడం లాంఛనమే. అయితే, విపక్ష ఇండియా కూటమి నేతలు టీడీపీ, జేడీయూతో సంప్రదింపులు నిన్నంటి నుంచే సంప్రదింపులు మొదలెట్టారన్న వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. 

భవిష్యత్తు కార్యాచరణపై ఇండియా కూటమి నేతలతో చర్చలు చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించడం ఉత్కంఠ మరింత పెంచేసింది. కొత్త పార్టీలను కూటమిలోకి ఆహ్వానించడంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కూటమి భాగస్వాములతో మాట్లాడే వరకూ కొత్త పార్టీల చేరిక గురించి ఏమీ చెప్పలేము. ఏం జరుగుతుందో చూద్దాం. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ప్రధాని మోదీ అప్రమత్తమయ్యే ప్రమాదం ఉంది’’ అని ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం టీడీపీ అధినేత చంద్రబాబు సొంతం. హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులు కావడంలో ఆయన పాత్ర ఉంది. పార్టీలకు అతీతంగా జాతీయస్థాయి నేతలతో చంద్రబాబుకు అనుబంధం ఉంది. అయితే, తాము ఎన్డీయేతోనే ఉంటామని సీనియర్ టీడీపీ నేత నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. 

నితిశ్ కుమార్ రాజకీయ జీవితం ముగిసిందనుకుంటున్న తరుణంలో తాజా ఎన్నికలు ఆయనను కింగ్ మేకర్‌ను చేశాయి. ఇండియా కూటమి భాగస్వాములతో పొసగక నితీశ్ కుమార్ ఎన్నికలకు ముందు ఎన్డీఏతో జట్టుకట్టిన విషయం తెలిసిందే. తన రాజకీయ ప్రాధాన్యాల విషయంలో స్పష్టంగా ఉండే నితీశ్ కుమార్ తదుపరి ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

  • Loading...

More Telugu News