USA: భారత ఎన్నికల నిర్వహణను ప్ర‌శంసించిన‌ అమెరికా

US praises India Lok Sabha polls as largest exercise of democracy in history
  • భారత లోక్‌సభ ఎన్నికలను ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద కసరత్తుగా కితాబు
  • ఎన్నికల ఫలితాలపై తాము వ్యాఖ్యలు చేయబోమన్న అగ్ర‌రాజ్యం
  • ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయ‌ని వ్యాఖ్య‌
  • భారత ఎన్నికల్లో యూఎస్ స‌హా విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయన్న ఆరోపణలు 
  • ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసల వ‌ర్షం కురిపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించిన‌ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలియజేసింది. అయితే ఎన్నికల ఫలితాలపై తాము వ్యాఖ్యలు చేయబోమని, ఎవరు గెలిచినా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. మంగళవారం కొన్ని స్థానాలకు ఫలితాలు వెలువడినప్పుడు, భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మిల్లర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"భారీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న భారత ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మేం స్పందించబోం. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగుతాయి. మేము మా అభిప్రాయాలను ఎల్లప్పుడూ స్పష్టంగా, బహిరంగంగా వ్యక్తపరుస్తాము. మనకు ఆందోళన కలిగించే విషయాలు ఉన్నప్పుడు మాత్ర‌మే మేము వాటిని విదేశీ ప్రభుత్వాలతో ప్రైవేట్‌గా వ్యక్తీక‌రించ‌డం జ‌రుగుతుంది. అదే నేను చేశాను. కానీ అది ఏ విధంగానూ భారతదేశంలో లేదా మరెక్కడైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం కాదు" అని మాథ్యూ మిల్లర్ అన్నారు. 

అదే స‌మ‌యంలో భారత ఎన్నికల్లో యూఎస్ స‌హా విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు. అంతమాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని మిల్లర్‌ చెప్పారు. అమెరికా, భారత్‌ల మధ్య సన్నిహిత భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కాగా, భారత ఎన్నికల సంఘం (సీఈసీ) తుది ఫలితాలను బుధవారం తెల్లవారుజామున ప్రకటించింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి.
USA
India
Lok Sabha Polls

More Telugu News