NOTA: గెలుపు ఓటములపై నోటా ప్రభావం.. మెజారిటీ కన్నా నోటాకు పడ్డ ఓట్లే ఎక్కువ

NOTA Effect On Candidates Winning Chances

  • మహారాష్ట్రలో 48 ఓట్లతో గెలిచిన అభ్యర్థి.. అక్కడ నోటాకు 15 వేల ఓట్లు
  • కేరళలో 684 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. నోటాకు 9 వేలకు పైగా ఓట్లు
  • ఛత్తీస్ గఢ్ లో 18 వందల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి.. ఇక్కడ 18 వేల మందికి నోటా మీట నొక్కారు

లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలను నోటా మార్చేసింది. ‘నన్ ఆఫ్ ది ఎబౌవ్’ అంటూ ఓటర్లు నొక్కిన మీటతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. నోటాకు పడ్డ ఓట్లు కాస్త అటూఇటుగా తమకు పడి ఉంటే విజయం తమనే వరించేదని వాపోతున్నారు. గెలిచిన అభ్యర్థికి దక్కిన మెజారిటీ కంటే నోటాకు పోలైన ఓట్ల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. చివరి రౌండ్ వరకూ ఉత్కంఠ నెలకొన్న పలు సీట్లలో కొద్దిలో ఓటమి పాలైన అభ్యర్థులు నోటాకు పడ్డ ఓట్లను తలుచుకుని బాధపడుతున్నారు.

మహారాష్ట్రలో..
ముంబై నార్త్ వెస్ట్ నుంచి శివసేన (షిండే) పార్టీ టికెట్ తో పోటీ చేసిన రవీంద్ర దత్తారామ్ వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి రౌండ్ వరకూ శివసేన (యూబీటీ) అభ్యర్థి అన్మోల్ కీర్తికర్, రవీంద్ర దత్తారామ్ మధ్య విజయం దోబూచులాడింది. చివరి రౌండ్ తర్వాత రవీంద్రకు 4,52,644 ఓట్లు పోలవగా.. కీర్తికర్ కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. దీంతో 48 ఓట్ల మెజారిటీతో రవీంద్ర గెలుపొందారు. అయితే, ఇక్కడ నోటాకు పోలయిన ఓట్లు 15,161 కావడం విశేషం.

కేరళలో..
అత్తింగళ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్వొకేట్‌ అదూర్‌ ప్రకాశ్, సీపీఎం అభ్యర్థి వి.జాయ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. చివరకు 684 ఓట్ల మెజారిటీతో అదూర్ ప్రకాశ్ విజయం సాధించారు. అదేసమయంలో ఇక్కడ నోటాకు ఏకంగా 9,791 మంది ఓటేశారు. 

ఒడిశాలో..
జయపురంలో భాజపా అభ్యర్థి రవీంద్ర నారాయణ్‌ బెహరా తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి శర్మిష్ఠ సేథీపై 1,587 ఓట్లతో గెలుపొందారు. బెహరాకు 5,34,239 ఓట్లు, సేథికి 5,32,652 ఓట్లు పోలవగా.. నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి.

రాజస్థాన్ లో..
జైపూర్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్ ఛోప్రా కేవలం 1,615 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఛోప్రాకు 6,16,262 ఓట్లు, సింగ్‌ కు 6,17,877 ఓట్లు రాగా నోటాకు 7,519 ఓట్లు పోలయ్యాయి.

ఛత్తీస్‌గఢ్‌లో..
కాంకేర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్‌ నాగ్‌ కాంగ్రెస్ అభ్యర్థి బీరేశ్ ఠాకూర్ పై 1,884 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజ్ నాగ్ కు 5,97,624 ఓట్లు, ఠాకుర్‌ కు 5,95,740 ఓట్లు పోలవగా.. నోటాకు ఏకంగా 18,669 మంది ఓటేశారు.

  • Loading...

More Telugu News