YS Sharmila: ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టండి.. చంద్రబాబుకు షర్మిల సూచన
- ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ
- ఏపీకి మేలు కలిగేలా ఆలోచన చేయాలన్న షర్మిల
- విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో మద్దతివ్వాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా షర్మిల పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేయాలని చంద్రబాబును కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. లోక్ సభ ఫలితాల తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారిన నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే విషయంలో పలు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు పట్టుబట్టాలని చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. విభజన హామీలకు కట్టుబడతామని హామీ ఇస్తేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేలా, రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చేలా చూడాలన్నారు. రాజధాని నిర్మాణం జరగాలని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ కూటమి సమావేశంలో పట్టుబట్టాలని కోరారు. కాగా, ప్రజల పక్షాన కాంగ్రెస్ చేపట్టిన పోరాటాన్ని, జనం గొంతుకగా పార్టీ తీసుకున్న స్టాండ్ ను ఇకపైనా కొనసాగిస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.