DK Aruna: రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలి: బీజేపీ నాయకురాలు డీకే అరుణ
- 14 సీట్లు వస్తాయని... ఈ ఎన్నికలో తమ పాలనకు రెఫరెండమని రేవంత్ చెప్పారన్న డీకే అరుణ
- పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోయినందుకు రాజీనామా చేయాలని వ్యాఖ్య
- కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచినా గెలిచామన్న డీకే అరుణ
- రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం
మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు నైతికంగా రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని... 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... కానీ సీఎం సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలన్నారు.
బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకొని బీజేపీని గెలిపించిందని రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోతే అభివృద్ధి జరగదని హెచ్చరించారని మండిపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రే అభ్యర్థిలా వ్యవహరించారని విమర్శించారు. కొంతమంది నేతలు కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచారని... అయినప్పటికీ తన గెలుపును ఆపలేకపోయారన్నారు.
బీజేపీకి పది సీట్లు వస్తాయనుకుంటే ఎనిమిది మాత్రమే వచ్చాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి మోదీ అభివృద్ధి నినాదం వెళ్లిందన్నారు. కానీ తమను ఓడించేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు... రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.