BJP: 0.7 శాతం ఓట్లు మాత్రమే కోల్పోయిన బీజేపీ... కానీ 63 సీట్లు తగ్గాయి
- 2019లో 37.3 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 36.6 శాతం దక్కించుకుంది
- కాంగ్రెస్ ఓటు బ్యాంకు 1.7 శాతమే పెరిగినా సీట్లు 52 నుంచి 99కి పెరుగుదల
- యూపీలో ఇండియా కూటమికి దాదాపు సమానంగా బీజేపీ ఓటు బ్యాంకు
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే 63 స్థానాలు తగ్గాయి. 2019లో ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 240 సీట్లకు పరిమితమైంది. సీట్లు భారీగా తగ్గినప్పటికీ బీజేపీకి తగ్గిన ఓటింగ్ షేర్ మాత్రం 1 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. 2019లో బీజేపీ 37.3 శాతం ఓట్లు సాధించగా... ఈసారి 36.6 శాతానికి తగ్గింది. కేవలం 0.7 శాతం ఓట్లు తగ్గడంతో బీజేపీకి 63 సీట్లు తగ్గాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ 2019లో 19.5 శాతం ఓట్లు సాధించింది. ఈసారి 21.2 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం పెరగడంతో సీట్లు ఏకంగా 52 నుంచి 99కు పెరిగాయి.
తమిళనాడులో బీజేపీకి ఓటింగ్ షేర్ భారీగా పెరిగింది. కానీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో 3.2 శాతం ఉన్న ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఈసారి 11.2 శాతానికి ఎగబాకింది. పంజాబ్లో దాదాపు రెట్టింపయింది. ఇక్కడ 9.6 శాతం నుంచి 18.6 శాతానికి పెరిగింది.
బీహార్లో బీజేపీ ఓట్ షేర్ 23.6 శాతం నుంచి 20.5 శాతానికి తగ్గడంతో ఏకంగా ఐదు సీట్లు నష్టపోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో 1.6 శాతం మాత్రమే ఓట్లు తగ్గినా 6 సీట్లు కోల్పోయింది. మహారాష్ట్రలో అయితే కేవలం 1.4 ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ బీజేపీకి భారీ నష్టం జరిగింది. ఏకంగా ఆ పార్టీ 23 నుంచి 10 సీట్లకు పడిపోయింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 16.3 శాతం నుంచి 17.1 శాతానికే పెరిగింది. అయినా సీట్లు ఏకంగా 1 నుంచి 13కు చేరుకున్నాయి. రాజస్థాన్లో 3.7 శాతం ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ఒక్క సీటూ గెలుచుకోని కాంగ్రెస్ ఇప్పుడు 8 స్థానాలు దక్కించుకుంది. ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ ఓట్ షేర్ 6.3 శాతం నుంచి 9.5 శాతానికి పెరగడంతో సీట్లు 6కు పెరిగాయి. ఎస్పీ ఓట్ షేర్ మాత్రం 18 శాతం నుంచి 33.5 శాతానికి పెరిగింది. దీంతో ఆ పార్టీ 37 సీట్లలో గెలిచింది. ఉత్తర ప్రదేశ్లో కూటమి ఓటు బ్యాంకు, బీజేపీ ఓటు బ్యాంకు దాదాపు సమానంగా ఉంది. బీజేపీ ఇక్కడ 43 శాతం ఓట్లు సాధించింది. ఇదిలా ఉండగా, బీజేపీకి 2019 లోక్ సభ ఎన్నికల కంటే ఈసారి 70 లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి.