Devendra Fadnavis: మహారాష్ట్రలో ఫలితాల ఎఫెక్ట్... రాజీనామాకు సిద్ధపడిన డిప్యూటీ సీఎం ఫడ్నవీస్
- 23 సీట్ల నుంచి 9 సీట్లకు పరిమితమైన బీజేపీ
- ఫలితాలకు బాధ్యత తనదేనంటూ అధిష్ఠానానికి ఫడ్నవీస్ లేఖ
- డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
- రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవడానికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు వెల్లడి
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సీట్లు గతంలో కంటే సగానికి పైగా పడిపోయాయి. 2019లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 9 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో బీజేపీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి, అలాగే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు తన రాజీనామా పత్రాలను పంపించారు.
ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు తాను పూర్తిగా బాధ్యతను స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడ పార్టీకి నాయకత్వం వహించింది తానేనని తెలిపారు. ఫలితాలకు తాను బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. అందుకే ప్రభుత్వ పదవి నుంచి తనను విడుదల చేయమని పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలనుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే పని చేయాలని భావిస్తున్నామన్నారు.