Rikshaw Puller: ఎండలో చెమటోడుస్తున్న రిక్షా కార్మికుడికి యువతి సాయం
- బ్రిడ్జిపై రిక్షా సులువుగా ముందుకు కదిలేలా నెట్టిన వైనం
- ఆమె పెద్ద మనసు చాటుకుందంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. 5 లక్షలకుపైగా వ్యూస్
నడివేసవిలో రోడ్డుపై నడిచి వెళ్తేనే చెమటలు కారిపోతాయి.. అలాంటిది ఎండలో కాయకష్టం చేసే రిక్షా కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. అందుకే ఓ యువతి పెద్ద మనసు చాటుకుంది. బ్రిడ్జిపై రిక్షా తొక్కలేక అవస్థ పడుతున్న ఓ కార్మికుడికి చిరుసాయం చేసింది. బ్రిడ్జిపైకి రిక్షా సులువుగా ఎక్కేలా వెనక నుంచి ముందుకు తోసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి.
ఆ వీడియోలో ఓ కార్మికుడు పెద్ద కూలర్ ను తన రిక్షాలో బ్రిడ్జిపై తీసుకెళ్తుండటం కనిపించింది. దీన్ని చూసిన యువతి వెంటనే స్పందించింది. అలసిపోయిన కార్మికుడికి ఊరటనిస్తూ వెనక నుంచి రిక్షాను నెట్టింది. దీన్ని మరొకరు వీడియో తీశారు. అయితే ఎండ వేడికి ఆమె కూడా అలసిపోవడంతో వీడియో తీస్తున్న వ్యక్తిని కాస్త సాయం చేయాలని కోరింది. చివరకు బ్రిడ్జిపైకి రిక్షా చేరుకొని ఏటవాలుగా కిందకు దిగే క్రమంలో ఓసారి ఆగాల్సిందిగా కార్మికుడిని ఆ యువతి కోరింది. అతను రిక్షా ఆపగానే చేతిలో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ తోపాటు తలకు చుట్టుకోవడానికి టవల్ ను ఇచ్చింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువతిని ప్రశంసిస్తున్నారు. ఒకవేళ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే ఈ వీడియో పెట్టినా ఆమె మంచిపనే చేసిందని పేర్కొన్నారు. రీల్స్ కోసం అడ్డమైన వీడియోలు చేసే వారితో పోలిస్తే ఆమె చేసిన వీడియో ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు.