Starlink In Amazon Forest: కారడవుల్లో ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ సేవలు.. పోర్న్‌కు బానిసలుగా గిరిజనులు
- బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ సేవలు
- ఇంటర్నెట్ సేవలతో గిరిజన యువతలో పెనుమార్పులు
- స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిన యువత
- అశ్లీల వీడియోలు విరివిగా షేర్ చేస్తున్న వైనం
- యువతను ఎలా కాపాడుకోవాలో తెలీక గిరిజన పెద్దల్లో ఆందోళన
అవి బ్రెజిల్ లోని దట్టమైన అమెజాన్ అడవులు. అక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా మారుబోస్ గిరిజన తెగ జీవిస్తోంది. తమదైన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తోంది. అయితే, ఆధునిక వసతుల లేమితో గిరిజనుల జీవితాల్ని కష్టాలమయంగా మార్చింది. ఈ నేపథ్యంలో గతేడాది తొలిసారిగా అక్కడ ఆధునికత తొలి కిరణం ప్రసరించింది. టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ పుణ్యమా అని గిరిజనులకు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్లు హస్తాభరణంగా మారాయి. అది మొదలు ఏడాది వ్యవధిలో వారి జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
ఇంటర్నెట్ సేవల రాకతో గిరిజనులకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు క్షణాల్లో చేరుతున్నాయి. పాము కాటుకు గురైన సందర్భాల్లో స్థానికులు తమ ఫోన్ల ద్వారా అత్యవసర సిబ్బందికి సమాచారం అందించడం, వారు క్షణాల్లో హెలికాఫ్టర్లలో వచ్చి బాధితులను కాపాడాటం నిత్యకృత్యంగా మారింది. పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అయితే, యువతలో మాత్రం ఆందోళనకర మార్పులు ప్రారంభమయ్యాయి. నిత్యం స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్న యువతలో బద్ధకం విపరీతంగా పెరిగిపోయింది. పనిపై ఆసక్తి కనుమరుగైంది. సామాజికంగా కూడా పలు మార్పులు మొదలయ్యాయి. బహిరంగ ప్రదేశాలలో స్త్రీపురుషులు ముద్దాడటమే తప్పుగా భావించే స్థితి నుంచి యువత పోర్న్ వీడియోలకు బానిసలైన స్థితి వచ్చిపడింది. అశ్లీల వీడియోలు ఇష్టారీతిన షేర్ చేస్తూ, చూస్తూ పక్కదారి పట్టిపోయారు.
ఈ పరిస్థితిపై గిరిజన పెద్దల్లో ఆందోళన మొదలైంది. పాశ్చాత్య జీవినశైలి ప్రభావంతో తమ యువత సొంత సంస్కృతి, సంప్రదాయాల్ని మర్చిపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చివరకు విశృంఖలత్వానికి దారి తీస్తుందని వణికిపోతున్నారు. అయితే, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ఇంటర్నెట్ సేవలు కొనసాగాలనే వారు కోరుకుంటున్నారు. కానీ తమ జీవన విధానాన్ని ఎలా రక్షించుకోవాలో, యువతను సక్రమమార్గంలో ఎలా నడిపించాలో తెలియక డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు.