Andhra Pradesh: గ్రామ సచివాలయాల్లో డేటా చోరీ!
- విలువైన డేటాను రాష్ట్రం దాటించినట్లు పోలీసుల సందేహం
- ఐటీ శాఖ కార్యాలయంలో తనిఖీలు
- ఈ-ఆఫీస్ లాగిన్ లను డిజేబుల్ చేసిన ఐటీ శాఖ
గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఏపీ పోలీసులు గుర్తించారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారులుగా పనిచేసిన కొందరు వ్యక్తులు ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన డేటా చౌర్యానికి గురైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విలువైన సమాచారాన్ని రాష్ట్రం దాటించారని భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఐటీ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పాత ఫైళ్లలో మార్పులు చేసే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా ‘ఈ-ఆఫీస్’ లాగిన్ లను డిజేబుల్ చేశారు.
సీఎం పేషీ, మంత్రుల పేషీలకు సంబంధించిన లాగిన్లను కూడా డిజేబుల్ చేశారు. గనులు, ఎక్సైజ్, ఆర్థిక శాఖలకు సంబంధించిన కీలకమైన ఫైళ్ల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని భావించి.. లాగిన్లను వెంటనే నిలిపివేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఐటీశాఖ అప్రమత్తం చేసింది. డేటా చౌర్యంపై ఫిర్యాదు అందడంతో పోలీస్ శాఖలోని ఐటీ విభాగం ఉన్నతాధికారులు స్పందించారు. సచివాలయంలోని ఐటీ శాఖ కార్యాలయంలో బుధవారం తనిఖీ చేశారు. డేటా చౌర్యం, ఫైళ్ల ట్యాంపరింగ్ జరిగాయా అనే కోణంలో సిబ్బందిని ప్రశ్నించారు. వారి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను పరిశీలించారు. పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలనకు పంపించారు.