Chandrababu: చంద్రబాబు విజయానికి గుర్తుగా ‘జయ జయోస్తు’ గ్రంథాలు
- గ్రంథాలను రూపొందిస్తున్న కిమ్స్ ఆసుపత్రుల చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య
- ఈ మహత్తర కార్యాన్ని పురాణపండకు అప్పగించిన వైనం
- రేపు మంగళగిరి చేరుకోనున్న గ్రంథాలు
- తొలుత మంగళగిరి నరసింహస్వామి, బెజవాడ దుర్గమ్మకు సమర్పణ
- ఆ తర్వాత టీడీపీ శ్రేణులకు పంపిణీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ఆయనకు జయం పలుకుతూ రెండు గ్రంథాలు సిద్ధమవుతున్నాయి. కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ఈ గ్రంథాలను రూపొందిస్తున్నారు. ఈ రెండు మంగళ గ్రంథాలలో ఒకదాని రచనను ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు అందించారు. గ్రంథంలో ఒకవైపు చంద్రబాబు దంపతుల ఫొటోలు ఉండాలని, మిగిలిన భాగాన్ని దైవత్వంతో నింపాలని కోరినట్టు కృష్ణయ్య తెలిపారు. ఈ గ్రంథానికి ‘నారసింహో.. ఉగ్రసింహో’గా నామకరణం చేశారు. నరసింహస్వామి కటాక్షం చంద్రబాబు దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ మహత్తర కార్యానికి శ్రీనివాస్ చేత శ్రీకారం చుట్టించినట్టు వివరించారు.
రెండో గ్రంథం ‘జయ జయోస్తు’. దాదాపు మూడు వందల పేజీలతో కూడిన ఈ పుస్తకంతోపాటు ‘నారసింహో.. ఉగ్రసింహో’ గ్రంథం రేపు (శుక్రవారం) అమరావతికి చేరుకుంటాయి. వీటిని తొలుత మంగళగిరి నరసింహస్వామికి, బెజవాడ దుర్గమ్మకు అందించిన అనంతరం పార్టీ శ్రేణులకు పంపిణీ చేస్తారు. చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు ఇలా అక్షరాలతో మంగళస్వరాలు అందిస్తున్న బొల్లినేని కృష్ణయ్య, పురాణపండ శ్రీనివాస్‌కు టీడీపీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నాయి. కాగా, ఈ గ్రంథాలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, లేదంటే చలన చిత్ర నిర్మాతల మండలి ద్వారా చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ అందించాలని బొల్లినేని కృష్ణయ్య యోచిస్తున్నారు.