Rohit Sharma: ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గాయం.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే..!
- నిన్న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో టీమిండియా మ్యాచ్
- బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హిట్‌మ్యాన్ చేతికి గాయం
- పేసర్ జోష్ లిటిల్ బౌలింగ్‌లో బంతి గట్టిగా తగలడంతో మైదానం వీడిన రోహిత్
- ఆ గాయం అంత సీరియస్‌గా ఏమీ లేదన్న భారత కెప్టెన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హిట్‌మ్యాన్ చేతికి బంతి గట్టిగా తగిలింది. పేసర్ జోష్ లిటిల్ బౌలింగ్‌లో బంతి బలంగా తగలడంతో మైదానం నుంచి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. 9వ ఓవర్ రెండో బంతి రోహిత్ చేతికి తగిలింది. ఈ క్రమంలో 10వ ఓవర్లో అతను గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు.
కాగా, ఆ గాయం సీరియస్‌గా లేదని తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని రోహిత్ శర్మ చెప్పాడు. కాస్త నొప్పిగా ఉందని మాత్రం వెల్లడించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే 3 సిక్సులు, 4 బౌండరీల సాయంతో అర్ధ శతకం (52) నమోదు చేశాడు. ఇదే మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కూడా 11వ ఓవర్లో మోచేతికి బంతి తగిలింది. ఫిజియో నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న అతడు ఇన్నింగ్స్‌ను పూర్తి చేశాడు.
ఇక న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో పిచ్ విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొత్త పిచ్ కావడంతో బంతులు నేరుగా బ్యాటర్ల మీదకే దూసుకు వస్తున్నాయి. దీంతో నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆ పిచ్‌పై బౌన్సు ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇక అవుట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉంది.
పిచ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని నిన్నటి మ్యాచ్‌లో టాస్ సమయంలోనే చెప్పినట్లు రోహిత్ తెలిపాడు. కేవలం అయిదు నెలల క్రితం నిర్మించిన ఈ పిచ్ గురించి చెప్పడం కష్టమే అవుతుందన్నాడు. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్ సెటిల్ కాలేదన్నాడు. సరైన లెన్త్‌లో బౌలింగ్ చేస్తే, ఇలాంటి పిచ్‌లపై చాలా సులువుగా వికెట్లు పడగొట్టవచ్చని అన్నాడు.
ఇక జూన్ 9న కూడా భారత్ ఇదే పిచ్‌పై దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. పాక్‌తో మ్యాచ్ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి ఉంటుందని హిట్‌మ్యాన్ అన్నాడు. దీని కోసం ప్రతి ఆటగాడు ప్రిపేర్ కావాలని తెలిపాడు. ప్రతి ప్లేయర్ నాణ్యమైన క్రికెట్ ఆడాల్సి ఉంటుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.