ADR Report: కొత్త ఎంపీల్లో 105 మంది చదివింది ఇంటర్ లోపే

105 New MP are declared their educational qualification to be between class 5 pass and class 12 say ADR Report
  • 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకే చదువుకున్నది 19 శాతం మంది ఎంపీలు
  • డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన 420 మంది కొత్త ఎంపీలు
  • నూతన ఎంపీల విద్యార్హత వివరాలను ప్రకటించిన ఏడీఆర్ రిపోర్ట్
మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో గెలిచిన ఎంపీల విద్యార్హత వివరాలను ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం 543 మంది ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టనుండగా.. అందులో 19 శాతం (105) మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే చదివారని నివేదిక తెలిపింది. ఇద్దరు 5వ తరగతి వరకు, నలుగురు 8వ తరగతి వరకు, 34 మంది 10వ తరగతి వరకు, 25 మంది 12వ తరగతి వరకు చదువుకున్నారని తెలిపింది. ఇక 420 మంది (77 శాతం) గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని పేర్కొంది. నూతన ఎంపీల్లో 17 మంది డిప్లొమా చేశారని, ఒక ఎంపీ కొద్దిపాటి అక్షరాస్యుడు మాత్రమేనని ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. కాగా లోక్‌‌సభ ఎన్నికలలో మొత్తం 121 మంది నిరక్షరాస్యులు పోటీ చేయగా వారందరూ ఓటమి పాలయ్యారు.

కాగా పీఆర్ఎస్ అనే మేధో సంస్థ లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. కొత్తగా గెలిచిన ఎంపీలకు వ్యవసాయం, సామాజిక సేవ సాధారణ వృత్తులుగా ఉన్నాయని విశ్లేషించింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌ ఎంపీల్లో 91 శాతం, మధ్యప్రదేశ్‌ ఎంపీల్లో 72 శాతం, గుజరాత్‌ నుంచి గెలిచిన ఎంపీల్లో 65 శాతం మందికి వారి వృత్తుల్లో వ్యవసాయం ఒకటిగా ఉందని రిపోర్ట్ పేర్కొంది. ఇక ఎంపీలలో 7 శాతం మంది లాయర్లు, 4 శాతం మంది వైద్యులు ఉన్నారని వివరించింది.
ADR Report
Lok Sabha Election Results
New MPs
Lok Sabha Polls

More Telugu News