Rakesh Reddy: ఎమ్మెల్సీ ఉపఎన్నిక... ఓట్ల లెక్కింపుపై రాకేశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- మూడో రౌండ్‌లో ఓట్ల లెక్కింపు తారుమారు చేశారని ఆరోపణ
- ఏకపక్షంగా ఓ అభ్యర్థికి మెజార్టీని ప్రకటించారని ఆగ్రహం
- రిటర్నింగ్ అధికారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మూడో రౌండ్‌లో ఓట్ల లెక్కింపును తారుమారు చేశారని ఆరోపించారు. ఏకపక్షంగా ఓ అభ్యర్థికి మెజార్టీని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రౌండ్‌ను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేశారు. ఒక అభ్యర్థికి మేలు చేసే విధంగా కౌంటింగ్ జరుగుతోందని ఆరోపించారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండా లీడ్ ప్రకటించారన్నారు.
తమ సందేహాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. అతనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. మూడో రౌండ్ వివరాలు అడిగితే పోలీసులు బయటకు నెట్టారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పైన తమకు నమ్మకముందని వ్యాఖ్యానించారు.
సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు సంబంధించి మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 2,64,216 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా గుర్తించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీకి 34,516 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్‌కు 27,493 ఓట్లు వచ్చాయి.