Kethireddy Venkatrami Reddy: సీఎంవోలో జగన్ ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పడిగాపులు కాయడం చూశాను: కేతిరెడ్డి

Kethireddy sensational comments on CMO

  • ఏపీలో వైసీపీ ఓటమి
  • ధర్మవరంలో స్వల్ప తేడాతో పరాజయంపాలైన కేతిరెడ్డి
  • జగన్ కు, ఎమ్మెల్యేలకు మధ్య సీఎంవో వాళ్లు గ్యాప్ క్రియేట్ చేశారని వెల్లడి

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన కేతిరెడ్డి... గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమంతో చాలా పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. 

ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి కూడా ఆసక్తికరం. ఆయన బీజేపీ రాష్ట్ర నేత సత్యకుమార్ చేతిలో ఓడిపోయారు. 9వ రౌండ్ వరకు 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న కేతిరెడ్డి... అక్కడ్నించి ఆధిక్యం కోల్పోతూ వచ్చారు. చివరి రౌండ్ లో కేతిరెడ్డి పుంజుకున్నప్పటికీ, పోస్టల్ బ్యాలెట్లతో కలిపి సత్యకుమార్ 3,700 పైచిలుకు మెజారిటీతో విజేతగా నిలిచాడు. 

ఆ పరాజయంతో కేతిరెడ్డి తీవ్ర విచారానికి గురయ్యారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత జగన్ ను ఉద్దేశించి కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. 

"జగన్ కు, ఎమ్మెల్యేలకు మధ్య ఓ గ్యాప్ ఉంది. సీఎం చాంబర్ బయట చాలాసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు పడిగాపులు కాయడం చూశాను. లోపల ఎవడో కూర్చుని మాట్లాడుతుంటాడు. బయట వేచిచూస్తున్న వాళ్లు తమ బాధను ఎవరితోనూ చెప్పుకోలేరు, అలాగని గొడవపడలేరు. ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధులకు మధ్య సీఎంవో వాళ్లు ఓ గ్యాప్ ను సృష్టించారు. దాంతో ప్రజాప్రతినిధులు సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోయింది. 

నన్నే ఉదాహరణగా తీసుకుంటే... ధర్మవరంలో ఓ ఫ్లై ఓవర్ భూసేకరణ కోసం 100 సార్లు సీఎంవో చుట్టూ తిరిగాను. ఒక గుంతలు పడిన రోడ్డు కోసం 40-50 సార్లు తిరిగుంటాను. అవేమన్నా మా ఇంట్లో పనులా... ప్రజలకు సంబంధించిన పనులు. మేం వాళ్ల వెంటపడి తిరగాల్సి వచ్చేది. దీని వల్ల నష్టపోయింది ఎవరు? సీఎంవోకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయాము అని చెప్పను కానీ... ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేల సంబంధాలను మాత్రం సీఎంవో వాళ్లు చెడగొట్టగలిగారు" అని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News