Wasim Akram: అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓటమిపై వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wasim Akram reacts on Pakistan lose against US in T20 World Cup

  • టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్, అమెరికా మ్యాచ్
  • సూపర్ ఓవర్ లో గెలిచిన అమెరికా
  • పాక్ జట్టులో గెలవాలన్న తపన కనిపించలేదన్న వసీం అక్రమ్

టీ20 వరల్డ్ కప్ లో పసికూన అమెరికా చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంపై క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ స్పందించారు. గెలుపోటములు ఆటలో సహజం అని, చివరి బంతి వరకు పోరాడడం ఎంతో ముఖ్యమని అన్నారు. కానీ అమెరికాతో మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టులో అలాంటి దృక్పథమేదీ కనిపించలేదని విమర్శించారు. అమెరికా చేతిలో పాక్ ఓటమికి కారణం ఇదేనని పేర్కొన్నారు. 

పాక్ టపటపా వికెట్లను కోల్పోయిందని, అమెరికా బౌలర్లు మెరుగ్గా రాణించారని కితాబునిచ్చారు. కెప్టెన్ బాబర్ అజామ్, షాదాబ్ తప్పించి, మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారని, ఫీల్డింగ్ లోనూ అంతంత మాత్రమేనని అన్నారు. 

అమెరికాతో మ్యాచ్ అనగానే, పాకిస్థాన్ తప్పకుండా గెలుస్తుందని అందరం భావించామని, కానీ చివరికి పాక్ ఓడిపోయిందని అక్రమ్ విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆటతీరు యావరేజి కంటే తక్కువగా ఉందని విమర్శించారు.

ఇకపై ఇక్కడ్నించి ప్రతి మ్యాచ్ పాక్ కు కీలకమేనని, సూపర్-8 దశకు చేరాలంటే పాక్ చాలా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే... జూన్ 9న భారత్ తో ఆడాల్సి ఉందని, ఆ తర్వాత ఐర్లాండ్, కెనడా జట్లను కూడా తక్కువ అంచనా వేయలేమని అక్రమ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News